రాజ్మా అంటే చాలామందికి పెద్దగా తెలియకపోవచ్చు కానీ, కిడ్నీ బీన్స్ అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు. రంగులోనూ, రూపంలోనూ ఇది మూత్రపిండాలని పోలి ఉంటుంది. అందుకే దీనిని కిడ్నీ బీన్స్ అని పిలుస్తారు. ఇది శరీరానికి కావలసిన ముఖ్యమైన పోషకాహారాలలో ఒకటి. అలానే, మన డైట్ లో ఖచ్చితంగా ఉండాల్సిన పదార్థాలలో కూడా ఒకటి. దీనిని చాలా మంది ఇష్టంగా తింటుంటారు. సౌత్ ఇండియన్స్ కంటే… నార్త్ ఇండియన్స్ వీటిని ఆహార పదార్ధాలలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.
రాజ్మాని నాన్-వెజ్ కి ప్రత్యామ్నాయంగా చెప్పుకోవచ్చు. దీనిని ఆహారపదార్ధాలలో భాగంగా చేసుకున్నట్లయితే… మన శరీరానికి అనేక రకాల పోషకాలని అందించిన వాళ్ళమవుతాం. రాజ్మాలో విటమిన్-బి1, బి2, బి3, బి6, బి9, సి, ఇ, కె లతో పాటు, ఫైబర్, ప్రొటీన్స్, ఇంకా క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, ఐరన్, జింక్, సోడియం వంటి ఖనిజ లవణాలు లభిస్తాయి.
రాజ్మా ఎక్కువగా రెడ్, వైట్, బ్లాక్, క్రీమ్, పర్పుల్, మరియు డిఫరెంట్ స్పాట్స్ తో లభిస్తాయి. రాజ్మా ఉడికించిన నీటితో రసం పెట్టుకోవచ్చు. అలానే, రాజ్మాని ఉడికించిన నీటిలో కాస్త ఉప్పు, జీలకర్ర పొడి వేసుకుని తాగితే నీరసం తగ్గుతుంది. మరి అలాంటి రాజ్మాని తినడం వల్ల శరీరంలో ఏయే అద్భుతాలు జరుగుతాయో మీరే చూడండి.
డయాబెటీస్ నియంత్రణకి –
రాజ్మాలో గ్లూకోజ్ తక్కువ, ఫైబర్ ఎక్కువ ఉంటుంది. అంతేకాక, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉండటం వల్ల డయాబెటిక్ పేషెంట్లకి ఇది మంచిది. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నిరోధిస్తుంది. కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. ఇన్సులిన్ ని మెరుగుపరుస్తుంది.
గుండె ఆరోగ్యానికి –
రాజ్మాలో ఉండే ఫైబర్ రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. రక్తనాళాలు ఆరోగ్యంగా ఉండటంలో తోడ్పడుతుంది. రక్తపోటుని నివారిస్తుంది.
క్యాన్సర్ నివారణకి –
క్యాన్సర్ ని నివారించే యాంటీ ఆక్సిడెంట్లు ఈ రాజ్మాలో అధిక మొత్తంలో ఉన్నాయి. అంతేకాక, క్యాన్సర్ కణాలతో పోరాడగల ఫ్లేవనాయిడ్స్ ఈ రాజ్మా గింజలలో ఉన్నాయి.
బరువు తగ్గడానికి –
రాజ్మాలో ఉండే ఫైబర్, ప్రోటీన్ ఆకలిని మందగించేలా చేస్తాయి. ఒక్కసారి తింటే… కడుపు నిండినట్లు అనిపిస్తుంది. ఈ కారణంగా ఆహారాన్ని ఎక్కువగా తినలేరు. దీంతో బరువు తగ్గుతారు.
ఎముకల బలానికి –
రాజ్మాలో క్యాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు అధిక మోతాదులో ఉన్నాయి. దీనివల్ల ఎముకలు బలోపేతం అవడమే కాకుండా… బోలు ఎముకల వ్యాధిని అరికడుతుంది.
కండర నిర్మాణానికి –
రాజ్మా శరీరానికి మంచి శక్తిని ఇస్తుంది. అలాగే కండర నిర్మాణానికి దోహదపడుతుంది.
జీర్ణ సమస్యలు అరికట్టటానికి –
రాజ్మాలో ఎలాంటి ఫ్యాట్ పదార్ధాలు ఉండవు కాబట్టి వీటిని తింటే ఎలాంటి జీర్ణ సమస్యలు రావు. ముఖ్యంగా గ్యాస్ ప్రాబ్లెమ్స్ అసలే ఉండవు.
నాడీలోపాలు తగ్గటానికి –
రాజ్మా గింజలలో ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. గర్భవతులు వారానికి మూడుసార్లైనా వీటిని తీసుకుంటే, పుట్టబోయే పిల్లలకు నాడీలోపాలు రావు.
జుట్టు పెరుగుదలకి –
రాజ్మాలో ఉండే ప్రోటీన్లు, విటమిన్లు వల్ల జుట్టు వత్తుగా పెరుగుతుంది.
చివరి మాట:
రాజ్మాలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి, అవి కీటో డైట్‌లో ప్రధానమైనవి. అయితే, వీటిలో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువ. అందుకే, ఒక ప్రణాళికతో వీటిని మీ డైట్ లో భాగంగా తీసుకున్నట్లైతే ఆరోగ్యానికి ఎంతో మంచిది.