అరటిపండు తింటే… డాక్టర్ తో పనిలేదు అంటారు. అంతలా ఇమ్యూనిటీని పెంచుతుంది ఈ పండు. ఇది దాదాపు అన్ని సీజన్‌లలో దొరుకుతుంది. అంతేకాక చాలా చవకైనది కూడా.
అరటిపండులో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. దీనిని చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ఎవరికైనా పెట్టొచ్చు. హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం అరటిపండుని ఎంతో పవిత్రంగా చూస్తారు. అలాంటి ఈ అరటిపండు సుమారు 4000 సంవత్సరాల క్రితమే పుట్టి… మలేషియాలో పెరిగింది. ఆ తర్వాతే ప్రపంచమంతా వ్యాపించింది.
అయితే, ఎప్పుడైనా అరటిపండు షేప్ ని గమనించారా? అది వంకరగా ఎందుకు ఉందని ఆలోచించారా? లేదు కదూ! ఆ విషయాల గురించే ఇప్పుడు తెలుసుకుందాం.
అరటిపండు షేప్ వెనుక ఓ సైంటిఫిక్ రీజన్ ఉంది. అదేంటంటే, మొదట చెట్టుకి అరటి పూలు గుత్తులు గుత్తులుగా ఉంటాయి. వాటి మొగ్గలన్నీ భూమి వైపుకి వంగి ఉంటాయి. ఈ అరటి మొగ్గలనుంచీ పుట్టుకొచ్చిన అరటిపండ్లు సూర్యరశ్మి వచ్చినప్పుడల్లా సూర్యుని వైపు కదలడం ప్రారంభిస్తాయి. అలా కదలటం వల్లే అరటి ఆకారం వంకరగా మారింది.
బొటానికల్ హిస్టరీ ప్రకారం… అరటి చెట్లు మొదట వర్షారణ్య ప్రాంతంలో పుట్టాయి. అక్కడ సూర్యరశ్మి చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల అరటిపండ్లు పెరగడానికి అరటిచెట్టు దానికదే వాతావరణానికి అనుగుణంగా తనని తాను మార్చుకుంది. మొదట భూమివైపుకి తిరిగి ఉంటుంది. తరాత సూర్యునికోసం ఆకాశం వైపుకి తిరుగుతుంది. అందుకే అరటి పండు ఎప్పుడూ వంకరగా ఉంటుంది.