This is the secret of Veda Vyasa’s birth హైందవ సాంప్రదాయంలో వ్యాసునికి గొప్ప స్థానమే ఉంది. హిందువులు పరమ పవిత్రంగా భావించే వేదాలను విభజింఛి… వేదవ్యాసుడయ్యాడు. అష్టాదశ పురాణాలు, ఇతిహాసాలు రాశాడు. బ్రహ్మ సూత్రాలని రచించి… గురువులకే గురువుగా మారాడు. చివరికి సప్తచిరంజీవులలో ఒకడిగా మిగిలాడు. అలాంటి వేదవ్యాసుని పుట్టుక వెనుక గొప్ప రహస్యమే దాగి ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వ్యాసుని వంశం:
వేద వ్యాసుడు ద్వాపర యుగంలో జన్మించాడని చెప్పడానికి హిందూ పురాణాలలో అనేక ఆధారాలు ఉన్నాయి. తల్లి ఆదేశం మేరకు భరతవంశ పునరుద్ధరణ కొరకు పాటుపడతాడు. అంతేకాదు, ఈ యుగాంతం వరకూ కర్తవ్యనిర్వహణ మాత్రమే చేస్తూ… మిగిలిన వారికి కర్తవ్యబోధ చేస్తూ… తిరిగి తనదారిన తాను వెళ్ళిపోతాడు.
వ్యాసుని జననం:
బెస్త జాతికి చెందిన సత్యవతికి, వశిష్ట మహర్షి మనమడైన పరాశరుడికి పుట్టినవాడే ఈ వ్యాస మహర్షి. సత్యవతి అసలు పేరు కాళి. ఆమెని ‘మత్స్యగంధి’ అని కూడా పిలుస్తారు. ఈమె తన తండ్రి లేని సమయంలో యమునానదిలో నావ నడుపుతూ ఉండేది. పరాశరుడు వశిష్ట మహర్షి కుమారుడైనటువంటి శక్తి మహర్షికి జన్మిస్తాడు. జోతిష్యానికి తొలి గురువు ఈ పరాశరుడు.
ఒకరోజు పరాశరుడు యమునానది దాటడానికి పడవ కోసం వెతుకుతూ ఉంటాడు. అప్పుడు మత్స్యగంధి అతనిని నది దాటించే బాద్యత తీసుకుంటుంది. కొంతదూరం నదిలో ప్రయాణం సాగించిన తర్వాత మత్స్యగంధిని చూసి మోహించిన పరాశరుడు ఆమెని కోరుకుంటాడు. ఇలా వీరిద్దరికీ జన్మించిన బిడ్డే వ్యాసుడు. వ్యాసుని అసలుపేరు కృష్ణద్వైపాయనుడు.
వ్యాసుని జీవితం:
వ్యాసుడు కారణజన్ముడు కావడంతో, పుట్టిన వెంటనే అతని తల్లికి, తండ్రికి నమస్కరించి… తపస్సు చేసుకోవటం కోసం అడవులకి వెళ్ళిపోతాడు. అవసరమైనప్పుడు ఎప్పుడైనా తనని తలుచుకుంటే ప్రత్యక్షమయ్యే వరాన్ని తల్లికి ఇస్తాడు. అలా అడవులకి వెళ్లి తపస్సు చేసి… మహా తపస్వి, మహిమాన్వితుడు, సద్గుణశీలుడు, సర్వవిద్యాపారంగతుడు, జగద్గురువుగా మారతాడు.
వ్యాసుని రచనలు:
వ్యాస మహర్షి అష్టాదశ పురాణాలని ఔపాసన పట్టాడు. ప్రజలకి మేలు చేయటం కోసం బ్రహ్మ సూత్రాలని రాశాడు. మొత్తం ఒకటిగా ఉండే వేదాలని ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం మరియు అధర్వణవేదం అనే 4 భాగాలుగా విభజించాడు. అష్టాదశ పురాణాలని రచించాడు. భారతం, భాగవతం వంటి ఇతిహాసాలని రాశాడు. కర్మ, భక్తి, జ్ఞానం అనే మూడు మార్గాలను స్థాపించాడు. గురువులకే గురువుగా నిలిచాడు. ఆయన రచనలు మొత్తం ప్రపంచానికి స్ఫూర్తినిస్తాయి.
వ్యాసుని ప్రభావం:
హిందువులు వ్యాసుని చిరంజీవిగా భావిస్తారు. ప్రజల శ్రేయస్సు కోసం ఆయన భూమిపై ఇంకా జీవిస్తూనే ఉన్నాడని నమ్ముతారు. ఆది శంకరాచార్యులు ఇతనిని దర్శించుకున్నాడు. అంతేకాక, ఇంకా నిజమైన భక్తి, విశ్వాసం ఉన్నవారికందరికీ ఆయన దర్శనాన్ని ఇస్తాడు. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వ్యాప్తి చేయడం కోసం జన్మించిన వారందరికీ వ్యాసుని జీవితం ఒక ఉదాహరణ.
వ్యాస పౌర్ణమి:
పూర్వ కాలంలో, హిందువులు చతుర్మాసం వస్తే… ఆ నాలుగు నెలలు ధ్యానం చేయడానికి అడవికి వెళ్ళేవారు. అంటే… ఈ మాసమంతా ధ్యానానికి అనుకూలమైన వాతావరణం కలిగి ఉంటుంది. ఈ చాతుర్మాసంలో వచ్చే ఆషాఢ పౌర్ణిమినే ‘వ్యాస పౌర్ణమి’ లేదా ‘గురుపౌర్ణమి’ అని పిలుస్తారు. ఈ పవిత్రమైన రోజున వ్యాసుడు వేదాలని రాయడం ప్రారంభించాడు. వేదవ్యాసుడు ప్రజలకి ఆధ్యాత్మిక వారసత్వాన్ని అందించాడు. ఈ కారణంగానే ఆయనని మానవాళికంతటికీ గురువుగా భావిస్తుంటారు.